హైదరాబాద్, హిమాయత్ నగర్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): గృహ వినియోగ, వాణిజ్య సిలిండర్ల ధరల పెంపుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు మండిపడ్డారు. మహిళా దినోత్సవాన దేశంలోని ఆడబిడ్డలకు ప్రధాని మోదీ ఇచ్చిన కానుక ఇదేనా అని ప్రశ్నించారు. సిలిండర్ ధర పెంపు నేపథ్యంలో పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మోదీ సర్కారు రాకముందు రూ.400గా ఉన్న గృహ వినియోగ సిలిండర్ ధర రూ.1150కి పెరిగిందని, ఇప్పుడు పెంచిన రూ.50తో కలిపి రూ.1200కి చేరుకుందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలకు వ్యతిరేకంగా ఎక్కడి వారక్కడ వినూత్న రీతిలో ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ధరల పెంపుతో గ్యాస్ సిలిండర్‌ను చూస్తేనే మహిళల కళ్లల్లో నీళ్లు వస్తున్నాయని, మహిళల శక్తి ఏమిటో త్వరలోనే మోదీకి తెలుస్తుందని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఇక.. ‘పేదలను ఆదుకునే దేవుడు మోదీ’ అంటూ ప్రచారం చేసుకునే రాష్ట్ర బీజేపీ నేతలు వెంటనే స్పందించి, పెరిగిన ధరలు తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీపీం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ‘‘ప్రధాని మోదీ పేద ప్రజలకు అత్యంత దుర్మార్గమైన శత్రువు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు.