న్యూఢిల్లీ, మార్చి 1: అలా త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికలు ముగిశాయో లేదో.. ఇలా ‘బండ’ బాదుడు షురూ చేసింది మోదీ సర్కారు! సామాన్యుల నడ్డివిరిచేలా గృహావసర, వాణిజ్య వినియోగ సిలిండర్లపై మోయలేని భారం మోపింది. అంతర్జాతీయ ధరలను సాకుగా చూపుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు డొమెస్టిక్ సిలిండర్ ధరను రూ.50 చొప్పున, వాణిజ్య సిలిండర్ ధరను రూ.350.5 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అదే సమయంలో విమాన ఇంధన (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) ధరలను 4 శాతం మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ నిర్ణయాలు బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నట్టు స్పష్టం చేశాయి. తాజా పెంపుతో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.1105 నుంచి రూ.1155కు చేరుకుంది. అలాగే, వాణిజ్య సిలిండర్ల ధర రూ.1973 నుంచి రూ.2325కు చేరింది.
గతంలో ప్రధాని మోదీ పిలుపునకు స్పందించి సబ్సిడీని వదులుకున్న వారందరికీ.. పెరిగిన ధరాభారం మోయక తప్పని పరిస్థితి! ప్రస్తుతం దేశం మొత్తమ్మీదా కలిపి కేవలం 9.58 కోట్ల సిలిండర్లు మాత్రమే పీఎం ఉజ్వల యోజన కింద ఉన్నాయి. వాటికి మాత్రమే ఒక్కో సిలిండర్‌కూ సబ్సిడీగా రూ.200 ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వ విధానం ప్రకారం ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ ధరలను అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా సవరించాలి. కానీ, డొమెస్టిక్ సిలిండర్ల ధరలను 2022 జూలై తర్వాత సవరించడం ఇదే. కమర్షియల్ సిలిండర్ల ధరలను మాత్రం చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో రూ.25 మేర పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా 15 రోజుల సగటు ఆధారంగా ప్రతిరోజూ సవరించాల్సి ఉంది. కానీ, 2022 ఏప్రిల్ 6 తర్వాత చమురు సంస్థలు వాటిని సవరించట్లేదు. ఇక విమాన ఇంధనం విషయానికి వస్తే.. కిలోలీటరుకు రూ.4,606.50 మేర తగ్గించినట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటరుకు రూ.1,07,750.27కు తగ్గింది. 2021 జనవరి నాటికి దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.694 నుంచి రూ.750 మధ్య ఉంది. అప్పట్నుంచీ దాదాపు 15సార్లు ధరలు పెంచారు. దీంతో 2023 మార్చి 1 నాటికి సిలిండర్ ధర రూ.1103-రూ.1155కు చేరింది. అంటే కేవలం రెండేళ్ల వ్యవధిలో 400 రూపాయల మేర మోదీ సర్కారు భారం మోపిందని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మేమొస్తే 500 లోపే!
తాము అధికారంలోకి వస్తే ఈ దోపిడీకి ముగింపు పలుకుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఈ పెంపుపై స్పందించారు. 2014లో కాంగ్రెస్ పాలనలో సిలిండర్ ధర రూ.410గా ఉండేదని, రూ.827 సబ్సిడీగా వచ్చేదని.. 2023లో బీజేపీ పాలనలో సిలిండర్ ధర రూ.1103కు (ఢిల్లీ ధర) చేరి, సబ్సిడీ మాత్రం ఏమీ రావట్లేదని ఆయన గుర్తుచేశారు. ‘‘కాంగ్రెస్ హయాంలో సబ్సిడీ రూపంలో ప్రజలకు ఊరట లభించేది.. కానీ ‘మిత్రకాలం’లో ప్రజల జేబులు కొట్టి మిత్రులకు పంచిపెడుతున్నారు’’ అంటూ ఆయన మోదీ సర్కారు ‘అమృత్‌కాల్’ నినాదాన్ని స్ఫురణకు తెస్తూ విమర్శించారు. ఇక.. 2014 నుంచి మోదీ సర్కారు సిలిండర్ ధరలను 275 శాతం మేర పెంచారని ప్రియాంక విమర్శించారు. రాజస్థాన్ సర్కారు ప్రస్తుతం గ్యాస్ సిలిండర్లను రూ.500కే అందిస్తోందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజస్థాన్ తరహాలోనే దేశప్రజలందరికీ రూ.500కే సిలిండర్ అందుబాటులోకి తెస్తుందని పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ అన్నారు.