అయోధ్య: అయోధ్య (Ayodhya)లోని ధనీపూర్ (Dhannipur) గ్రామంలో మసీదు (Mosque) నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ వారంలో జరుగనున్న అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ (ADA) సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ పౌండేషన్ (IICF) ట్రస్టు ప్రతినిధి ఒకరు బుధవారంనాడు తెలిపారు. తొలుత స్థలం వేరేచోట కేటాయించడంలో జరిగిన జాప్యం, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం మరికొంత జాప్యం జరిగిందని చెప్పారు.
ధనీపూర్ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతను ఐఐసీఎఫ్ ట్రస్టుకు ఉత్తరప్రదేశ్ సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు (యూపీఎస్‌సీడబ్ల్యూబీ) అప్పగించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మసీదు నిర్మాణం కోసం ధనిపూర్ గ్రామంలో 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. 3,500 చదరపు మీటర్లలో మసీదు నిర్మాణ బాధ్యతను ఐఐసీఎఫ్ ట్రస్టుకు వక్ఫ్ బోర్డు అప్పగించింది. మసీదు స్థలంలో నాలుగు అంతస్థుల సూపర్ స్పెషాలిటీ ఛారిటీ హాస్పిటల్, 24,150 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కమ్యూనిటీ కిచెన్, 500 చదరపు మీటర్లలో ఒక మ్యూజియం, 2,300 చదరపు మీటర్లలో ఇండో-ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్‌ను కూడా నిర్మించనున్నారు.