కుక్కను చంపడానికి.. పిచ్చిదన్న ముద్ర ఎలాగైతే వేస్తారో.. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలోనూ కేంద్రం ఇదే పద్ధతి పాటిస్తోంది. ఏ దశలోనూ చేయూతనివ్వకుండా అడుగడుగునా దానిని నష్టాల పాల్జేస్తూ.. దివాలా దిశగా నడిపిస్తోంది. అస్మదీయ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే నాటకమాడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్).. అంటే విశాఖ ఉక్కు కర్మాగారం. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో తెలుగువారి ఉద్యమ ఫలితంగా ఏర్పడిందీ సంస్థ. పుట్టినప్పటి నుంచీ కేంద్రం అడ్డంకులు సృష్టించినా దినదిన ప్రవర్ధమానంగా ఎదిగింది. నాణ్యమైన ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. అలాంటి సంస్థను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అమ్మేయాలని మోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిని అడ్డుకోవడానికి ఉద్యోగులు, కార్మికులు దీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. అయినా కేంద్రానికి చీమకుట్టినట్లయినా లేదు. దానిని దివాలా తీయించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరగకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. దాంతో ఉత్పత్తి వ్యయం పెరిగి పరిశ్రమకు నష్టాలు అధికమవుతున్నాయి. ముడి పదార్థాలు కొనడానికి కూడా నిధుల్లేని పరిస్థితి తలెత్తితే.. ఆర్థిక సహకారం అందకుండా కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. చివరకు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయేలా చేసింది. కానీ ఉక్కు శాఖ తనకేమీ తెలియదన్నట్లు అమాయకత్వం నటిస్తోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ త్వరలో ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్‌రప్టసీ (ఐబీఎ్‌స)కి వెళ్లక తప్పని స్థితి వచ్చిందంటూ తాజాగా ఓ అంతర్గత నివేదికలో మొసలి కన్నీరు కార్చింది. ఐబీఎస్-2016 చట్టానికి కేంద్రం ఇటీవల సవరణలు చేసింది. వ్యూహాత్మకం కాని రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు దివాలా తీస్తే.. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) కూడా అందులో జోక్యం చేసుకోకూడదని కొత్త నిబంధన తెచ్చింది. ఒకవేళ విశాఖ ఉక్కు ఐబీసీకి వెళితే.. కర్మాగారాన్ని మూసివేయడం ఖాయం. అందులో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు రూపాయి కూడా ఇవ్వరు. న్యాయపోరాటం చేయడానికీ అవకాశం ఉండదు. కర్మాగారాన్ని ఇలా నాశనం చేసి.. ప్రైవేటుకు కట్టబెట్టేలా సెటిల్ చేయడానికే ఇంత తంతు నడిపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదీ ప్రస్తుత పరిస్థితి..
విశాఖ ఉక్కు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 73 లక్షల టన్నులు. ఈ లెక్కన రోజుకు 21 వేల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలి. కానీ ఇక్కడ మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉండగా బొగ్గు కొరత కారణం చూపించి ఏడాది నుంచి ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూసేశారు. మిగిలిన రెండింటి ద్వారా రోజుకు అత్యధికంగా 15 వేల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ ఉక్కుకు వర్కింగ్ కేపిటిల్ లేదు. ఆర్థిక సాయం చేయాలని కోరుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదు. ముడి ఇనుము సరఫరా చేసే ఎన్‌ఎండీసీకి రూ.2,500 కోట్లు బకాయి పడితే.. దానిని గత డిసెంబరులో రుణంగా మార్చారు. ప్రతి నెలా బొగ్గును విదేశాల నుంచి తెప్పించుకోవడానికి రూ.1,000 కోట్లు కావాలి. స్టాట్యుటరీ పేమెంట్లు, జీతాలకు మరో రూ.600 కోట్లు అవసరం. ఉత్పత్తి తగ్గడం, ఆ ప్రభావం అమ్మకాలపై పడడంతో చేతిలో నిధులు ఉండడం లేదు. బ్యాంకుల నుంచి రుణం తీసుకుందామంటే కేంద్రం అనుమతి ఇవ్వడం లేదు. అనేకసార్లు విజ్ఞప్తి చేయగా రెండు నెలల క్రితం రూ.500 కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ముడి పదార్థాల కోసం అడ్వాన్స్‌లు ఇవ్వాల్సి ఉంది. విస్తరణ కోసం చేసిన అప్పులు రూ.22 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఇటీవల చేసిన అప్పులన్నీ కలిసి మొత్తంగా రూ.25 వేల కోట్లు కాగా.. ఇవన్నీ నష్టాలేనని కేంద్రం ప్రచారం చేస్తోంది. ఈ మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరం(2022-23)లో మరో రూ.3 వేల కోట్ల నష్టం వచ్చిందని అప్పుడే హడావుడి మొదలుపెట్టింది. సంస్థ సరిగ్గా నడవక నష్టాల్లోకి వెళ్లిపోయిందన్న ముద్ర వేసి.. కావలసిన కార్పొరేట్ సంస్థలకు తక్కువ రేటుకు అప్పగించేందుకే ఈ కుట్ర చేస్తున్నారని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి.