విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో శుక్ర, శనివారాల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. ఇందుకోసం నగరాన్ని ముస్తాబు చేస్తున్నారు. రాత్రింబవళ్లు ఫుట్‌పాత్‌లకు రంగులేస్తూ, విద్యుద్దీపాలు అమరుస్తూ కూలీలు శ్రమిస్తూనే ఉన్నారు. మైదానంలో కూడా ఏర్పాట్లు పూర్తికాలేదు. ఇంకా 30 శాతం పనులు మిగిలే ఉన్నాయి. జర్మన్ హ్యాంగర్ల నిర్మాణం, ప్రవేశ ద్వారాల ఏర్పాటు పూర్తికాగా వేదికల నిర్మాణం, హోర్డింగ్‌ల ఏర్పాటు పనులు ఇంకా సాగుతున్నాయి. అవి పూర్తయిన తరువాత పూలమొక్కల డెకరేషన్, పారిశ్రామిక సంస్థల ప్రదర్శనకు స్టాళ్లు ఏర్పాటుచేయాల్సి ఉంది. ఆ తరువాత వేలాది మంది కూర్చోవడానికి కుర్చీలు, అతిథులకు సోఫాలు వేయాల్సి ఉంది. బయటకు అన్నీ పూర్తయినట్టు కనిపిస్తున్నా లోపల చేయాల్సినవి చాలా ఉన్నాయి.
అధికారుల సూచన
పెట్టుబడుల సదస్సుకు వేలాది మంది అతిథులు వస్తున్నందున వారందరికీ నిర్దేశించిన విధానంలో మర్యాదలు చేయాలని అధికారులు పదే పదే సూచిస్తున్నారు. పరిశ్రమల శాఖ కమిషనర్ సృజన, కలెక్టర్ మల్లికార్జున వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో బుఽధవారం నిర్వహించిన సమావేశంలో లైజనింగ్ అధికారులు, నోడల్ అధికారులకు పలు సూచనలు చేశారు. అందరినీ సమన్వయం చేసుకోవడం, కావలసినవి అందించడం, సదస్సుకు తీసుకురావడం, తిరిగి హోటల్‌కు చేర్చడం వంటి బాధ్యతలు 100 శాతం చిత్తశుద్ధితో నిర్వహించాలని సూచించారు. విమానాశ్రయం నుంచి సదస్సు వేదిక వరకు బుధవారం ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. కొన్ని లోటుపాట్లు గమనించి, వాటిని సరి చేయాలని సిబ్బందికి సూచించారు.
ఏపీ పెవెలియన్‌లో 137 స్టాళ్లు
సదస్సులో భాగంగా ఎగ్జిబిషన్ ఏర్పాటుచేస్తున్నారు. ఏపీ పెవెలియన్ పేరుతో 137 స్టాళ్లు పెడుతున్నారు. వివిధ రంగాలకు చెందిన వారంతా వారి వారి ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తారు. ఐటీ, ఫార్మా, మెరైన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, టూరిజం, టెక్స్‌టైల్స్…ఇలా పలు రంగాలకు చెందిన ప్రదర్శనలు ఉంటాయి. సదస్సుకు హాజరయ్యేవారు పేర్లు నమోదు చేసుకునేందుకు బుధవారం హెల్ప్ డెస్క్ ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు వేల మంది వరకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు. తాకిడి అధికంగా ఉండడంతో మరిన్ని డెస్క్‌ల ఏర్పాటుకు యత్నిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా సదస్సు ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం కొన్ని సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. కేపీఎంజీ, టైమ్స్ నౌ, సీఐఐతో పాటు ఈడీబీ సంస్థలు పనులు పర్యవేక్షిస్తున్నాయి.
నేడు సీఎం రాక
పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ నుంచి నగరానికి చేరుకుంటారు. రాత్రికి పోర్టు అతిథిగృహంలో బస చేసి మరుసటిరోజు…శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు సదస్సుకు హాజరవుతారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. రాత్రికి ఆర్‌కే బీచ్‌లోని ఎంజీఎం పార్కులో అతిథులకు విందు ఇవ్వనున్నారు. మరుసటిరోజు మళ్లీ సదస్సులో పాల్గొని ఎంఓయూలపై సంతకాలు చేస్తారు. అదేరోజు మఽద్యాహ్నం రెండున్నర గంటలకు బయలుదేరి విజయవాడ వెళ్లిపోతారు.