హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీవో నంబరు 59 కింద దరఖాస్తు చేసుకొన్న వారందరి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు పరిశీలించనుంది. అయితే 2022 మార్చి నాటి మార్కెట్ విలువలే (రిజిస్ట్రేషన్ వాల్యూ) ప్రామాణికంగా క్రమబద్ధీకరణ రుసుం తీసుకోనున్నారు. దీంతో దరఖాస్తుదారులకు రుసుం భారీగా పెరిగే అవకాశం ఉంది. క్రమబద్ధీకరణ కోసం జీవో నంబరు 59 కింద దరఖాస్తులు చేసుకొనేందుకు ప్రభుత్వం విధించిన కటాఫ్ తేదీని ఎత్తివేస్తూ చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశం అనంతరం 2014 డిసెంబరులో ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం జీవో నంబరు 59 జారీ చేశారు. తర్వాత కొన్ని స్థలాలను క్రమబద్ధీకరించారు. ఆ తర్వాత వచ్చిన విజ్ఞప్తుల మేరకు 2022 ఫిబ్రవరిలో ఆ జీవో కింద మళ్లీ దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. దీంతో 63,748 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను 2022 సెప్టెంబరులో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందులో 35వేల దరఖాస్తులను పరిశీలనలోనే తిరస్కరించారు. తిరస్కరించిన దరఖాస్తుల్లో 2014 జూన్2 నాటికి స్వాధీనంలో లేని భూముల దరఖాస్తులు కూడా ఉన్నట్లు అధికారులు తేల్చారు. అయితే ఈ జీవో కింద కిందటి ఏడాది వరకు దరఖాస్తులు సమర్పించే నాటికి స్వాధీనంలో ఉన్న వారికే అర్హత కల్పిస్తూ తాజాగా ప్రభుత్వం పాత జీవోకు సవరణ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో తిరస్కరించిన వారి దరఖాస్తుల పరిశీలనకు వీలు కలిగింది. స్వాఽధీనంలో ఉన్నట్టుగా ఆధారాలు సమర్పిస్తే క్రమబద్ధీకరణకు అర్హులేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది.