విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి):
సామాన్యుల నడ్డివిరిగేలా కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ బండ ధర పెంచింది. ‘అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మార్పు’ అనే విధానంతో ఎప్పటికప్పుడు రేటు పెంచుతోంది. తాజాగా మరోసారి 14.5 కిలోల వంట గ్యాస్ సిలిండర్‌పై 50 రూపాయలు పెంచింది. ప్రస్తుతం విశాఖపట్నంలో వంట గ్యాస్ ధర రూ.1,061గా ఉంది. బుధవారం నుంచే కొత్త ధర రూ.1,111తో పంపిణీ చేయడం ప్రారంభించారు. గతంలో రూ.900 సిలిండర్ ధర వున్నప్పుడు రూ.400 వరకు రాయితీ రూపంలో బ్యాంకులో జమ అయ్యేది. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆ రాయితీని ఎత్తేశారు. కేవలం నాలుగు రూపాయలు మాత్రమే బ్యాంకులో పడుతోంది.
ఎంత మార్పో…
తొలి విడత ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పుడు దేశంలో ధనిక, పేద తేడా లేకుండా అందరికీ వంట గ్యాస్‌పై రాయితీ ఇస్తున్నామని, డబ్బున్న వారు స్వచ్ఛందంగా రాయితీ లేకుండా గ్యాస్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడు కేవలం ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఉన్నతాధికారులు మాత్రమే రాయితీ లేకుండా పూర్తి ధరతో గ్యాస్ తీసుకుంటామని ముందుకువచ్చారు. ఈ విధంగా చేయడం వల్ల నిజమైన పేదలకు ఇంకా తక్కువ ధరకు గ్యాస్ అందివ్వగలమని అప్పట్లో మోదీ ప్రకటించారు. కానీ దశల వారీగా అసలు ఎవరికీ రాయితీ అనేది లేకుండా బహిరంగ మార్కెట్ రేటుకే గ్యాస్ తీసుకునేలా రేట్లు పెంచుకుంటూ వచ్చారు. 2014లో రూ.410 వున్న సిలిండర్ ధరను ఎనిమిదేళ్లలో దాదాపు రెండు రెట్లు పెంచి రూ.1,111 చేశారు. రాయితీ వుందని ప్రచారానికి నామమాత్రంగా నాలుగు రూపాయలు ఇస్తున్నారు.
ధరలు తగ్గించింది లేదు
గత ఏడాది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు పెట్రో ఉత్పత్తులతో పాటు వంట నూనెల ధరలు పెరిగాయి. అయితే రష్యాపై అమెరికా, యూరప్ దేశాలు విధించిన ఆంక్షలను కాదని భారత ప్రభుత్వం రష్యా నుంచి తక్కువ ధరకు అధిక మొత్తంలో ముడిచమురును దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. దీంతో వంటనూనెల ధరలు తగ్గించారే తప్ప పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు మాత్రం తగ్గించలేదు. పైగా ఇంకా పెంచుకుంటూ పోతున్నారు.
రోజువారీ ఆదాయంలో 10 శాతం గ్యాస్‌కే!
నగరంలో రోజువారీ కూలీలే అధికం. వారికి సగటున రోజుకు రూ.400 ఆదాయం వస్తుంది. కూలీ అయినా ఇప్పుడు గ్యాస్‌పైనే వంట చేసుకోవలసి ఉండడంతో తప్పనిసరిగా సిలిండర్ కొనుక్కోవాలి. కొత్త ఽధర ప్రకారం డెలివరీ బాయ్ అదనపు మొత్తం కలుపుకొని రూ.1,130 చెల్లించాలి. అంటే సగటున రోజుకు గ్యాస్ కోసం రూ.40 ఖర్చు అవుతోంది. అంటే రోజువారీ ఆదాయంలో పది శాతం దీనికే పెట్టాలి. ఇలాగైతే ఎలా బతుకుతామని కూలీలు వాపోతున్నారు.
13.5 లక్షల కుటుంబాలపై అదనపు భారం
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఆయిల్ కంపెనీలన్నింటికీ కలిపి సుమారుగా 13.5 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు సగటున ఎనిమిది లక్షల సిలిండర్ల డెలివరీ అవుతున్నాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున నెలకు రూ.4 కోట్ల మేర అదనపు భారం పడుతోంది.
గ్యాస్ ధర పెరుగుదల ఇలా…
2020 మే రూ.594
2021 మే రూ.830
2022 మే రూ.1,008
2022 జూలై రూ.1,061
2023 మార్చి రూ.1,111