యాదగిరిగుట్ట, మార్చి 1: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వెండి గరుడ సేవ, రాత్రి దివ్య విమాన రథోత్సవం నేత్రపర్వంగా సాగాయి. ప్రత్యేక పూజల అనంతరం వివిధ రకాల పుష్పాలు, మామిడి, అరటి తోరణాలతో స్వామివారి దివ్య విమానరథాన్ని అలంకరించారు. పట్టువస్త్రాలు, బంగారు, వెండి, ముత్యాల ఆభరణాలతో నూతన కల్యాణ దంపతులైన లక్ష్మీనారసింహులను అలంకరించి ప్రత్యేకసేవలో తీర్చిదిద్దారు. దివ్యవిమాన రథంపై అధిష్ఠింపజేశారు. అనంతరం ఆలయ తిరువీధుల్లో మంగళవాయిద్యాలు.. మేళతాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవ తిరుకల్యాణ లక్ష్మీనారసింహులను బుధవారం ఉదయం గరుడ వాహనంపై ఊరేగించారు.