పౌరసమాజ సంస్థ ముసుగులో సదస్సులోకి నిత్యానంద స్వామి ప్రతినిధుల ప్రవేశం
సెంట్రల్ డెస్క్: స్వయంప్రకటిత దేవుడు.. రేప్, కిడ్నాప్ కేసుల్లో నిందితుడు అయిన నిత్యానంద స్వామి సొంత దేశం ‘కైలాస’ ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి (యూఎన్) సదస్సుకు హాజరయ్యారన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది! నిజంగా ఇది నిజమేనా? దేశం విడిచి పారిపోయి.. తనకున్న డబ్బు, పరపతితో ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించిన నిత్యానందస్వామి లాంటి వ్యక్తుల ప్రతినిధులకు ఐక్యరాజ్యసమితిలో ప్రవేశం ఎలా లభించింది? అలా ఎవరిని పడితే వారిని మాట్లాడడానికి అనుమతిస్తారా? నిత్యానందలా రేపు మరో నేరగాడు ఎవరైనా తానో దేశాన్ని ఏర్పాటు చేశానని ప్రకటించి తన ప్రతినిధులను యూఎన్‌కు పంపిస్తే వారికి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చేస్తారా? ..అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇదంతా నిత్యానంద స్వామి ప్రచార బృందం చేస్తున్న గిమ్మిక్కు మాత్రమే. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల (సీఈఎ్‌సఆర్) కమిటీ జెనీవాలో నిర్వహించిన సదస్సుకు కైలాస తరఫున ‘మా విజయప్రియ నిత్యానంద’ తదితరులు హాజరైన మాట నిజమేగానీ.. వారు కైలాస దేశ ప్రతినిధులుగా అక్కడికి వెళ్లలేదు. ఈ ‘సీఈఎ్‌సఆర్’ అనేది.. సాంస్కృతి, సామాజిక, ఆర్థిక హక్కులకు సంబంధించి ఐక్యరాజ్యసమితిలో 1966లో కుదిరిన ఒప్పందం సరిగా అమలవుతోందా లేదా పర్యవేక్షించే వేదిక. దీంట్లో 18 మంది స్వతంత్ర నిపుణులు ఉంటారు. ఈ వేదిక నిర్వహించే సదస్సులకు సివిల్ సొసైటీ గ్రూపులను కూడా అనుమతిస్తుంది. ఇదుగో.. ఆ మార్గంలోనే కైలాస ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ‘కైలాస యూనియన్’ అనే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ పేరుతో సదస్సుకు హాజరు కావడానికి పత్రాలు సమర్పించారు. అది అమెరికాలో రిజిస్టర్ అయిన సంస్థ.