జూలూరు గౌరీశంకర్, రమేష్ హజారి అను మేము… చెప్పిందే చేస్తున్నాం, చేసేదే చెపుతున్నాం. గతంలో మేము రాసిన వేర్వేరు వ్యాసాలపై (ఆంధ్రజ్యోతి, జనవరి 17, 28) బిఆర్ బాపూజీ ‘వేయండి వీరికి వీరతాళ్లు’ అంటూ (ఫిబ్రవరి 15) ఉమ్మడిగా ఆరోపణలు చేశారు కనుక, ఉమ్మడిగానే ఇస్తున్న సమాధానం ఇది.
గౌరీశంకర్‌గానో, సాహిత్య అకాడమి చైర్మన్‌గానో, పిఆర్వోగానో, రమేష్ హజారిగానో మాకు ఒక అధినేత లేదా ఒక ప్రభుత్వ విధానం నచ్చితే, దాన్ని మేం ప్రశంసిస్తే అది ఎవరికో తప్పుగా కనపడితే మాకు సంబంధంలేదు. ప్రశంసించిన అంశంలో లోపాలుంటే వాటిపై విమర్శలను సంధించుకోవచ్చు కానీ, ఫలానా విషయం మీద మాత్రమే రాయాలనో, ఫలానా రకంగా మాత్రమే దాడి చెయ్యాలనో బెత్తం ఝుళిపించడం సమంజసం కాదు. మా విమర్శ, మా ప్రశంస మా సొంతం. సమాజానికి మేలు చేస్తుందని భావించిన మార్గాన్నే మేం ఎంచుకుంటున్నాం.